నీట్ యూజీ 2024 పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని ఇటీవల కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు అయితే తాజాగా అందుకుగల కారణాలను వివరిస్తూ మళ్లీ తీర్పు వెలువరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాలను ధర్మాసనం ఎత్తిచూపుతూ.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పింది. అయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. విద్యార్థుల భవితకు సంబంధించిన అంశంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరి కాదని హితవు పలికింది. ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలని పేర్కొంది.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీయేదేనని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇక ప్రశ్నపత్రం లీక్‌లను ఆరకట్టేందుకు సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌లోని లోసుగులను గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగించాలని ఎన్‌టీఏను కోర్టు ఆదేశించింది. ఇక నీట్ పేపర్ లీకేజీ లో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు చోటుచేసుకోలేదని.. పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీక్ జరగలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రశ్నపత్రం లీకేజీ ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్‌లోని పట్నా వరకే పరిమితమైందని.. దానిపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. అందుకే పరీక్షను రద్దు చేయాలనుకోలేదని పేర్కొంది. కాగా, నీట్‌లో సంస్కరణలను పరిగణనలోకి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పరిధిని పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వివరణాత్మక తీర్పునిచ్చింది.
ఇక మరోసారి పరీక్ష నిర్వహించాలన్న పిటిషన్‌ను తిరస్కరిస్తున్నప్పటికీ, పరీక్షలో అవకతవకలు జరిగినందున 44 మంది అభ్యర్థులు కచ్చితమైన మార్కులు సాధించారని చీఫ్ జస్టిస్ ప్రస్తావించారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్‌తో కూడిన కమిటీ సెప్టెంబర్ 30లోగా నివేదిక సమర్పించాల్సిందిగా గడువు విధించింది. పరీక్షా విధానాన్ని పటిష్టం చేసేందుకు సాంకేతికత పురోగతిని స్వీకరించేలా ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించడాన్ని కె.రాధాకృష్ణన్ కమిటీ పరిశీలించాలని సూచించింది.