టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి షాక్ ఇచ్చాడు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానం ప్రోత్సహిస్తామని.. తెలంగాణ నుంచి రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అంతే కాకుండా మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు సైతం నగరంలో భూమి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కౌశిక్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై స్పందించిన అంబటి రాయుడు ఈ జాబితాలో తన పేరును కూడా చేర్చడం పట్ల అంబటి రాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా అవసరమని.. మహ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఏ ప్రభుత్వం నుంచి స్థలం అవసరం లేదని ట్వీట్ చేశారు అంబటి. క్రికెటర్లుగా మేం ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలం. ఈ విషయంలో మేము అదృష్టవంతులం. నాకు భూమిని కేటాయించమని ప్రభుత్వానికి మీరు చేసిన అభ్యర్థనను నేను గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. నిజంగా ఆ అవసరం ఉన్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుతున్నా అని అంబటి రాయుడు ట్వీట్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంబటి రాయుడు 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పి, 2023లో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. రాయుడు ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడి 4348 పరుగులు చేశాడు. ముంబయి తరఫున మూడుసార్లు (2013, 15, 17), చెన్నై తరఫున మూడుసార్లు (2018, 2021, 2023) ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంబటి రాయడు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు..కాగా ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రస్తావనతో అంబటి వ్యాఖ్యలు వైరల్ అయ్యారు.