రిజర్వేషన్ల కోటా కోసం ఆందోళనలతో దేశం అల్లకల్లోలంగా మారడంతో..చివరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ నుంచి ఆమె సోదరి రెహానాతో పాటు షేక్ హసీనా భద్రత కోసం పక్కనే ఉన్న ఇండియాకు నిన్న అంటే ఆగస్ట్ 5న చేరుకున్నారు.
అయితే షేక్ హసీనాకు భారత్‌లో నివాసం పొందడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే హసీనా భారత్‌లో నివాసానికి భారత ప్రభుత్వం నుంచి తాత్కాలిక ఆమోదం మాత్రమే లభించిందని, యూకేలో ఆశ్రయం అంశం అనేది ప్రస్తుతం పెండింగ్లో ఉందని పేర్కొంటున్నాయి.
షేక్ హసీనా యూకేలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారని, కానీ అక్కడి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి దక్కలేదని.. అనుమతి దక్కే వరకు ఆమె భారత్లోనే ఉంటారని ‘డైలీ సన్’ అనే కథనం పేర్కొంది. షేక్ హసీనా రాజకీయ ఆశ్రయం విజ్ఞప్తికి సంబంధించి ప్రస్తుతానికి లండన్ గవర్నమెంటు నుంచి ఎలాంటి నిర్ధారణ లేదని పేర్కొంది. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారని ‘డైలీ సన్’ కథనం పేర్కొంది.
మరోవైపు బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులను భారతదేశం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది.నిన్న అది తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు కూడా దారి తీయటంతో భారత్ మరింత అప్రమత్తమైంది.యూపీలోని హిండన్ ఎయిర్ పోర్టులో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు షేక్ హసీనా విమానాన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. విమానంలోని సిబ్బందితో భారత్ దళాలకు చెందిన ఉన్నతాధికారులు స్వయంగా సంప్రదింపులు జరిపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.