ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హై కోర్టును ఆశ్రయించారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించిందని, ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు 2024 జూన్ 3న తనకు ఏ విధ మైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలని పిటిషన్లో జగన్ కోరారు. ముఖ్యమంత్రి పిటిషన్లో 2019లో తనపై దాడి జరిగిందని.. సీఎం కాకముందే ఉన్నత స్థాయి భద్రత కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 139 మందితో భద్రత కల్పించారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముందస్తు సమాచారం లేకుండా సెక్యూరిటీని గణనీయంగా తగ్గించారని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్రస్థాయి -సెక్యూరిటీ రివ్యూ కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు కల్పించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్ అసాల్ట్ టీములు, జామర్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో జగన్ విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రకటించి నెల గడవకముందే నాకున్న భద్రతా సిబ్బంది సంఖ్యను 59కి తగ్గించడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనన్నారు. ఎన్నికల ప్రచారంలో రాయితో దాడి చేశారని, ఈ ఘటనపై కేసు నమోదైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన జడ్ ప్లస్ సెక్యూరిటీని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని పిటిషన్లో జగన్ కోరారు.
తనకంటే ఎమ్మెల్యేలకు ఎక్కువ మంది సెక్యురిటీని కేటాయించారని ఆరోపించిన జగన్ తన ఇల్లు, కార్యాలయం వద్ద ఉన్న భద్రతను పూర్తిగా తొలగించారని, ప్రస్తుతం తనకు ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారని ఆరోపించారు. పోలీసులు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రయాణానికి అనుకూలంగా లేదని, అందులో ఏసీ పనిచేయడం లేదన్నారు. వాహనం లేకపోవడంతో ఓ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చిందన్నారు. తననున భౌతికంగా లేకుండా చేస్తామని అధికార కూటమి నేతలు ప్రకటనలు చేశారని పలు కథనాలకు సంబంధించిన వివరాలను పిటిషన్లో ప్రస్తావించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ పునరుద్ధరించాలని కోరుతూ జూన్ 7న కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశామని, వీటి ఆధారంగా భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని జగన్ హైకోర్టును కోరారు.