ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపకులాల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు బుధవారం భారత్ బంద్ కోసం పిలుపునిచ్చాయి. ఆగస్టు 1న ధర్మాసనం విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుతో ఎస్సీ, ఎస్టీలను ఉపవర్గాలుగా విభజించడానికి అంగీకారం తెలిపింది. దీనిలో భాగంగా నిజంగా అవసరమైన వారికి రిజర్వేషన్ల ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
అయితే, సుప్రీం నిర్ణయాన్ని కొన్ని కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికోసమే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయడంతో పాటు, దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. భారత్ బంద్ ను నిర్ణయాన్ని ప్రకటించాయి. ఈ భారత్ బంద్కు పలు రాజకీయ, సామాజిక సంస్థల మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు భారత్ బంద్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో.. పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు.
ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతమై పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో బంద్ సందర్భంగా హైఅల్టర్ ప్రకటించారు. నిరసనల సందర్భంగా ప్రజలకు భద్రత కల్పించడానికి పోలీస్ అధికారులు విస్తృత చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలు, దుకాణాలను మూసివేయాలన్న ప్రకటనతో స్కూల్స్ కు శెలవు ప్రకటించారు. అలాగే షాపులు బంద్ చేశారు. అలాగా చాలా ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఇక, తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం పెద్దగా లేకపోయినా .. కొన్ని సంఘాలు మద్దతు ఇచ్చి బంద్ లో పాల్గొన్నాయి. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత మహాసభ సభ్యులు బంద్ నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, రవాణా, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు బంద్ చేయించడానికి ప్రయత్నించారు.