విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడం, ఆ తర్వాత అక్కడ ఒక మంచి ఉద్యోగం.. ఆ తర్వాత అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకోవడం. ఇదీ భారతీయుల్లో కొన్నాళ్లుగా కనిపిస్తున్న ట్రెండ్. దీనికి తగినట్లే భారత్ నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.
చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వాళ్లంతా తర్వాత అక్కడే స్థిరపడటానికి మొగ్గు చూపిస్తున్నారు. దీంతో భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది.ఈ ఐదేళ్లలో ఏకంగా 8 లక్షల 34 వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా ఇండియా మారింది. అలాగే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న భారతీయులు కూడా ఎక్కువమందే ఉన్నారు. కరోనా మహమ్మారికి ముందు, 2011 నుంచి 2019 వరకు, ప్రతీ ఏడాది సగటున 1,32,000 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని గణంకాలు చెబుతున్నాయి.
అయితే అదే సమయంలో, 2020, 2023 మధ్య.. ఈ సంఖ్య ప్రతి ఏటా 20 శాతం పెరిగి రెండు లక్షలకు పైగా పెరిగినట్లు తేలింది. 2023లో ఏకంగా 2.16 లక్షల మంది ఇండియన్లు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. భారతీయుల వలసల గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇక ,2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది, 2022లో 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇలా 2018 నుంచి 2023 వరకు భారతీయులు 114 దేశాల్లో పౌరసత్వం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అయితే ఎక్కువమంది మాత్రం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీలలో స్థిరపడినట్లు తేలింది. ఇదిలా ఉంటే ఈ 6 ఏళ్లలో 70 మంది పాకిస్థాన్ పౌరసత్వం తీసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక 130 మంది నేపాల్ పౌరసత్వాన్ని పొందగా, 1,500 మంది కెన్యా పౌరసత్వాన్ని ఎంచుకున్నట్లు గణాంకాలు వివరించాయి.
మొత్తంగా అమెరికాలో విద్యనభ్యసిస్తున్న వారిలో భారత విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు. వీరిలో చాలామంది అక్కడ ఉండి అమెరికా పౌరసత్వం పొందడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తేలింది. దీంతో ఎక్కువ మంది అగ్రరాజ్యంలో పౌరసత్వం తీసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.