ఆగని హైడ్రా దూకుడు… దడ పుట్టిస్తున్న కూల్చివేతలు..

HYDRA Continues Demolition Drive | Mango News Telugu

ఆక్రమణదారుల గుండెల్లో హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు దడపుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ హైడ్రా అక్రమార్కులకు వణుకుపుట్టిస్తోంది. పేద, ధనిక అనే భేదం లేకుండా.. సినిమా స్టార్లు, రాజకీయ నేతలను కూడా వదిలిపెట్టకుండా కబ్జాల పర్వానికి చెక్ పెడుతోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగుళం ఆక్రమించిన కూడా సీరియస్ గానే స్పందిస్తోంది.

తాజాగా శేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో హైడ్రా అధికారులు.. ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన బిల్డింగులను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ జీహెచ్ఎస్‌సీ టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకున్న స్థానికులు.. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో.. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.చివరకు పోలీసుల ఆధ్వర్యంలోనే కూల్చివేతల పర్వం సాగుతోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా.. హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో రోజురోజుకు జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టానుసారంగా చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నేళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో..ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో చర్యలు చేపడుతోంది.

తాజాగా హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకోడానికి నాగ్ హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఈ లోపే అధికారులు ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేశారు.దీనిపై ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూనే ఉంది.

మరోవైపు బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్శిటీపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేశారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి.

అంతేకాదు ఇటు అధికార పార్టీ నేతలను కూడా హైడ్రా వదిలిపెట్టడం లేదు. ఇలా చిన్నా, పెద్ద తేడా లేకుండా హైడ్రా ఆక్రమణదారుల బెండు తీయడంపై రేవంత్ సర్కార్‌పై ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కబ్జాదారులు భయపడతారని, దీంతో చెరువులు, నాలాల ఆక్రమణకు గురవకుండా ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.