ఢిల్లీ లిక్కర్ కేసు లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదలయ్యారు. ఈడీ, సీబీఐ, కవిత తరఫున వాదనలు విన్న సుప్రీంకోర్టు.. రూ.10 లక్షల పూచీకత్తుతో పాటు పాస్ పోర్ట్ సీజ్ నిబంధనలతో కవితకు బెయిల్ మంజూరు చేసింది. కాగా తీహార్ జైలు నుంచి కవిత మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత భర్త అనిల్, అన్నయ్య కేటీఆర్‌ను గుండెలకు హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చారు. తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం చేశారంటూ కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని..బెయిల్ రాకుండా చేసారని..ఎవరిని వదిలిపెట్టమని ..వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించింది. నేను సాధారణంగా మొండిదాన్ని. ఇంకా నన్ను జగమొండిని చేశారు. ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో కావాలనే ఇబ్బందులు పెట్టారు. మూల్యం చెల్లించే తీరుతాను అని కవిత శపథం చేశారు.
కాగా కవిత అరెస్ట్ పై తెలంగాణ రాజకీయ పార్టీలు రచ్చ చేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందంతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంటే…కాంగ్రెస్ న్యాయవాదుల కృషితోనే కవితకు బెయిల్ పై విడుదల అయ్యారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. కాగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏ ఆధారాలు చూపకుండా కవితను అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారు.. రాజకీయ ప్రేరేపిత కేసులో చివరికి న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.
కేటీఆర్ కౌంటర్
మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కేంద్ర హోం వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ ఆరోపణలు మీ బాధ్యతకు సరికాదన్నారు. సుప్రీంకోర్టు కేంద్ర మంత్రి వ్యాఖ్యలను గుర్తించి కోర్టు ధిక్కార చర్యలను తీసుకోవాలని కోరారు. అంతకు ముందు కవితకు బెయిల్ రావడంపై కేటీఆర్ స్పందిస్తూ.. థాంక్యూ సుప్రీంకోర్టు, న్యాయం గెలిచింది అని ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మాజీ మంత్రి కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడంటూ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ చేసిన పోస్ట్‌లో తప్పేముంది, కవితకు బెయిల్ ఇవ్వాలని వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడం నిజం కాదా ? అని ప్రశ్నించారు. అలాగే, కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని, వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు పీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హరీష్‌రావు కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ వారి కాళ్లు మొక్కి బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి. ఇక కవిత విడుదలతో రెండు పార్టీల విలీన ప్రక్రియ మొదలు కాబోతుందని ఆరోపించారు.