ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ మూలాలను చెరిపివేసి.. కూటమి మార్కు పాలన కనిపించేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు తాము ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే .. గత పాలకుల వల్ల ఏపీ ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే మద్యం పాలసీని తీసుకురావడానికి శరవేగంగా కసరత్తులు చేస్తుంది.
గత వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో మద్యం బ్రాండ్లపై మీమ్స్ పేలుతుండేవి. చివరకు చీప్ లిక్కర్ తాగి ఎంతోమంది అనారోగ్యం పాలయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా ఎవరేమైనా సంబంధం లేనట్లు వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తించి మద్యంపై లాభాలు ఆర్జించడమే పనిగా పెట్టుకుంది. దీంతో ఈ ఎన్నికల హామీలో చెప్పినట్లుగానే.. త్వరలోనే పాత మద్యం బ్రాండ్ లకు చెల్లు చీటీ పాడేసి… బ్రాండెడ్ మద్యం తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతోంది.
మొత్తంగా అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త మద్యం పాలసీతో కొన్ని పాత బ్రాండ్లకు స్వస్తి పలకనుంది. ఏపీలో నాణ్యమైన బ్రాండ్‌లను అందుబాటులో ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మద్యం పాలసీల గురించి అధ్యయనం చేస్తోంది. ఏపీలో స్థానిక బ్రాండ్‌లను ప్రముఖ కంపెనీలతో భర్తీ చేయనుంది.
2014 నుంచి 2019 వరకు తన పాలనలో, టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేట్ వ్యాపారంగా పరిగణించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉండే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, 2019లో గత వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూసిందని ఆరోపణలు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఏపీలో ప్రసిద్ధ విస్కీ, బీర్ బ్రాండ్లు చాలా అందుబాటులో కనిపించలేదు.
బ్లాక్ బస్టర్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, న్యూ కేపిటల్ గవర్నర్ ఛాయిస్, లెజెండ్, పవర్ స్టార్ 999, సెవెంత్ హెవెన్, హై వోల్టేజ్ వంటి ఆసక్తికరమైన పేర్లతో కూడిన బ్రాండ్‌లను వైన్ షాపుల్లో అందుబాటులో ఉంచారు. వీటిని సోషల్ మీడియాలో జె-బ్రాండ్స్ అని పిలుస్తారు. ఈ మద్యం బ్రాండ్‌లన్నీ వైఎస్‌ఆర్‌సీపీ నేతలదేనని టీడీపీ, బీజేపీ పార్టీలు ఆరోపించాయి.