బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ మరోసారి అపర కుబేరుడుగా అవతరించారు. ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి తిరిగి నెంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ దాటేశారు. అంటే ఇప్పుడు మన దేశంలో నంబర్ 1 ధనికుడు గౌతమ్ అదానీ. గత ఐదేళ్లుగా దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని, ఏడాదిలో 29 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. అదే సమయంలో చైనాలో వీరి సంఖ్య 25 శాతం మేర తగ్గిందని పేర్కొంది.
హురూన్ ఇండియా జాబితా ప్రకారం ప్రస్తుతం అదానీ వద్ద రూ.11.61 లక్షల కోట్ల నికర సంపద ఉంది. గత ఏడాది వ్యవధిలో ఆయన సంపద దాదాపు 95 శాతం పెరిగింది. ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ వద్ద రూ.10.14 లక్షల కోట్ల సంపద ఉందని నివేదిక వెల్లడించింది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. మన దేశంలో మూడో ప్లేసులో ఉన్న అత్యంత సంపన్నుడు శివ్‌నాడార్. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ ఈయనదే. నాడార్ కుటుంబం వద్ద రూ.3.14 లక్షల కోట్ల సంపద ఉంది. వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా మన దేశంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు. సన్‌ఫార్మా కంపెనీ అధినేత దిలీప్ సంఘ్వీ సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. 6వ స్థానం నుంచి 10వ స్థానం వరకు వరుసగా కుమార మంగళం బిర్లా, గోపీచంద్ హిందుజా, రాధాకృష్ణ దమానీ, అజీమ్ ప్రేమ్‌జీ, నీరజ్ బజాజ్ ఉన్నారు.
గతంలో ఈ జాబితాలో కేవలం వ్యాపార వేత్తలు మాత్రమే ఉండేవారు. ఈ సారి మాత్రం ఈ జాబితాలో సినీ రంగానికి చెందిన వారు కూడా చోటు సంపాదించున్నారు. సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు తొలిసారి బిలియనీర్ల జాబితాలో చోటు దక్కింది. ఆయన సంపద రూ.7,300 కోట్లు. కోల్‌కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీల విలువ పెరగడంతో ఆయన సంపద ఇనుమడించింది. మన దేశంలోని అత్యంత సంపన్న సినీ ప్రముఖుల లిస్టులో షారుఖ్ తర్వాతి స్థానాల్లో జుహీ చావ్లా, హృతిక్ రోషన్, అమితాబ్, కరణ్ జోహార్ ఉన్నారు. అత్యంత సంపన్నుల లిస్టులో జెప్టో వ్యవస్థాపకుడు 21 ఏళ్ల కైవల్య వోహ్రా కూడా చేరారు. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఆయనే. ఈ కంపెనీ మరో సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల అదిత్ పలిచా పేరు కూడా ఈ లిస్టులో ఉంది.