కృష్ణాజిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కాలేజీ విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్‌రూమ్‌లల్లో మూడో కంటికి తెలియకుండా కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు చేపట్టి క్యాంపస్‌లో బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, నినదాలతో ఇంజినీరింగ్ కళాశాల మార్మోగిపోయింది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తోన్నారు. హాస్టల్ బాత్‌రూమ్‌లల్లో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థినుల వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్‌సైట్లల్లో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తోన్నారు.
విద్యార్థుల నిరసన ప్రదర్శలకు సంబంధించిన వీడియోలు, కొందరు విద్యార్థుల మధ్య జరిగినట్లుగా భావిస్తోన్న వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదుల్లోకి వెళ్లి.. వాళ్లను విచారించిన వీడియోలు సర్కులేట్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా నేడు కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా, నేరం రుజువయ్యే విధంగా ఆధారాలు లభించలేదన్న కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
కాగా ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై లోతుగా విచారణకు చేపట్టాలన్నారు. విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఆరా తీశారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్టు ట్వీట్ చేశారు.