తిరుమల శ్రీవారి లడ్డు ప్రియులకు గుడ్ న్యూస్..

Good News For Tirumala Srivari Laddu Lovers, Tirumala Srivari Laddu Lovers, TTD Free Laddu, Thirumala Laddu, Thirumala News, TTD, Laddu In Hyderabad, Tirumala, Tirumala Tirupati, Venkateswara Swamy, Tirupati, Latest Tirupati News, Andhra Pradesh, AP Live Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులంటే భక్తులకూ ఎంతో ఇష్టం. దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డు అంటే ఇష్టపడేవాళ్లు ఉన్నారు. లడ్డు తయారీ నాణ్యతపై టీటీడీ మరింత శ్రద్ద తీసుకుంటోంది. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించే విషయంలో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తోన్నారు. ఇదివరకే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించారు. కేఎంఎఫ్ నుంచి నందిని బ్రాండ్ నెయ్యిని కొనుగోలు చేశారు. నెయ్యితో కూడిన నందిని ట్యాంకర్లు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడారు. లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యిని వినియోగించడం వల్ల లడ్డూ నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.

గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారని గుర్తు చేశారు. అందుకే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించినట్లు వివరించారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించడానికి సరైన ల్యాబొరెటరీ సౌకర్యం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా అత్యాధునిక ల్యాబొరెటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేయడానికి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు శ్యామలరావు. ఇందులో ఎన్డిఆర్ఏ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగుళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని అన్నారు. ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కొనుగోలు టెండర్లల్లో ఎలాంటి అంశాలు చేర్చాలని దిశ నిర్ధేశం చేసిందని, వాటి మేరకు మార్పులు చేశామని వివరించారు. ఈ కారణంగా నెయ్యి నాణ్యత, రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు తెలిపారు.

కాగా హైదరాబాద్ లోను భక్తులకు లడ్డూను అందుబాటులోకి తెచ్చేలా.. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వారంలో ఒకరోజే అందుబాటులో ఉండే తిరుపతి లడ్డూ ఇకపై అన్ని రోజులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని హిమాయత్​ నగర్ టీటీడీ దేవాలయం ఇన్​స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు. ఇక నుంచి ప్రతిరోజూ హైదరాబాద్​నగర భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు(టీటీడీ)లో రూ.50కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది.

ఇక తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల పెద్ద ఎత్తున రైలు సర్వీసులు రద్దు కావడం, అనేక చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోవడం, జనజీవనం స్తంభించిపోవడం.. వంటి కారణాలు భక్తుల రోజువారీ సంఖ్యపై ప్రభావాన్ని చూపాయి. ఈ నెల 3, 4 తేదీల్లో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య 60 వేల లోపే ఉండటం దీనికి నిదర్శనం. 3వ తేదీన 57,817, 4వ తేదీన 57,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం నాడు ఈ సంఖ్య స్పల్పంగా పెరిగింది. 61,142 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వారిలో 21,525 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.20 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. ఈ వారాంతంలో తిరుమలలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోలేదు.