అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ రోజురోజుకు హీటెక్కుతోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో నగర వీధులు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు ప్రయత్నాలు చేయగా..ఇటు మరోసారి ఎలా అయినా అధికారంలోకి రావడానికి రిపబ్లికన్లు పోరాడుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 5న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. వారిద్దరూ తమ ప్రచార కార్యక్రమాలు, డిబేట్లలో జోరు పెంచారు.
ఎన్నికల వేడితో హీటెక్కుతున్న పరిస్థితుల మధ్య అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం వచ్చింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ బైడెన్ మోదీకి ఆహ్వానాన్ని పంపించగా.. దీనికి మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారత ప్రధాని అమెరికా పర్యటనపై ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
క్వాడ్ సభ్య దేశాల సమావేశానికి అమెరికా ఆతిథ్యాన్ని ఇవ్వబోతోందన్న విషయాన్ని ఇటీవలే ఆ దేశం వెల్లడించింది. ఈ నెల 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ క్వాడ్ సభ్య దేశాల సదస్సును ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్- పర్సన్ క్వాడ్ సమ్మిట్ ఈ సంవత్సరం విల్మింగ్టన్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్య దేశాలుగా ఉన్నాయి.
జో బైడెన్, ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ క్వాడ్ సభ్య దేశాల సమ్మిట్‌కు హాజరు కానున్నారు. వైట్‌హౌస్‌లో మొట్ట మొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ 2021లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ సమావేశం ఏర్పాటవుతూ వస్తోంది.
ఇక, క్వాడ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యకాలంలోనే ఎనిమిది సార్లు భేటీ అయ్యారు. సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్ ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులు, విపత్తుల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దుల భద్రత,సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై క్వాడ్ సభ్య దేశాల సమ్మిట్ లో ప్రధానంగా చర్చించనున్నారు.