చపాతీల,పుల్కా వంటివి చాలా మంది డైరక్టుగా స్టౌపైన పెట్టి కానీ, ఎక్కువ మంటపైన కానీ కాలుస్తుంటారు. వీటికి ఒక విధమైన రుచి ఉండటం వల్ల చాలామంది వీటిని తినడానికి ఇష్టపడతారు. పెద్ద పెద్ధ హోటల్స్ కూడా వీటిని స్పెషల్ గా తయారు చేసి ఇస్తుంటారు. అయితే వీటిని రెగ్యులర్ గా తినకూడాదని నిపుణులు అంటున్నారు.
ఒకవేళ ఇలా కాలుస్తున్నప్పుడు నల్లగా మాడిపోకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మంటను తగ్గించి.. రొట్టెలను తరచూ తిప్పడం వల్ల అవి ఎక్కువ కాలకుండా, మాడిపోకుండా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ మరీ మాడిపోతే నల్లగా మారిన ప్రాంతాలను తినకుండా తొలగించాలని సూచిస్తున్నారు.
ఒకవేళ మీకు నేరుగా మంటపై కాల్చిన రొట్టెలు, చపాతీలు కనుక నచ్చినా కూడా వాటిని వీలైనంత తక్కువ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటితో పాటు సమతుల్యమైన ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే మాంసాన్ని కూడా చాలామంది డైరక్టుగా మంటపైన పెట్టి తింటారు అయితే అలా నేరుగా మంటపై ఫ్రై చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు పెరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని చిట్కాలు పాటిస్తే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చని వైద్యులు అంటున్నారు. రొట్టెలను నేరుగా మంటపై కాల్చకుండా పెనంపైన వేసి కాల్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెనం ఎక్కువ ఉష్ణోగ్రతను గ్రహించి..తక్కువ వేడిపై రొట్టెలను కాల్చేలా సాయం చేస్తుందని తెలిపారు. దీనివల్ల PAHలు, అక్రిలమైడ్ ఉత్పత్తిని నిరోధిస్తుందని చెప్పారు.
చపాతీలు ఎక్కువగా తీసుకునే వారు వీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను డైట్లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ రాకుండా సహాయ పడటంలో దోహదపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.