సూపర్ సిక్స్ హామీల అమలుపై కూటమి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ లో ప్రముఖమైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం గురించి అలాగే తల్లికి వందనం పథకాల అమలు పైన కూడా చర్చ జరిగింది. ఈ సమయంలోనే ఈ రెండు పథకాల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల సమయంలో కూటమి నేతలంతా సూపర్ సిక్స్ హామీలనే ప్రధాన హామీగా చెబుతూ ప్రచారం చేశారు. అనుకున్నట్లుగా కూటమి అఖండ విజయం సాధించడంతో..ఇప్పుడు వాటి అమలు దిశగా చర్చలు జరుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ను 4 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఏపీ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అయింది.
ఇక సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా..తాజాగా మంత్రివర్గంలో చర్చ జరిగింది. మహిళలకు ఇచ్చిన హామీల్లో దేనిని ముందు అమలు చేయాలనే అంశంపైన మంత్రివర్గం చర్చించింది. ఉచిత వంట గ్యాస్ పథకం, ఉచిత బస్సు సౌకర్యం రెండింట్లో ఏది ముందు అమలు చేయాలనే దాని పైన మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు.
అయితే ఉచిత వంట గ్యాస్ పథకానికే ఎక్కువ మంది మొగ్గు చూపారు. దీంతో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని వచ్చే దీపావళి నుంచే అమలు చేయడానికి..నాలులు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఉచిత గ్యాస్ తర్వాత తల్లికి వందనం పథకంపై మెజార్టీ సభ్యులు మొగ్గు చూపడంతో.. తల్లికి వందనం పథకం అమలుకు కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ రెండు పథకాల అమలు తరువాతనే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దశల వారీగా అమలు చేయడానికి నిర్ణయించారు. దీంతో, వచ్చే సంక్రాంతికి తల్లికి వందన పథకం..వచ్చే ఏడాది మార్చి నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
తల్లికి వందనం పథకంలో.. బడికి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాల్లో ప్రతి ఏడాది 15 వేలు రూపాయల చొప్పున ఆర్దిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఈ పథకం పైన అందరి అభిప్రాయాలను తీసుకొని వైసీపీ ప్రభుత్వం కంటే కూడా మెరుగ్గా అమలు చేస్తామని వెల్లడించారు. అయితే, వైసీపీ మోయలేని ఆర్థిక భారాన్ని ఏపీకి మిగల్చడంతో.. ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. వీటి అమలు కోసం ముహూర్తం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.