తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన .. సెప్టెంబర్ 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు.
హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలను సడలించామని మంత్రులు వివరించారు. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద రప్పిస్తున్నామని వివరించారు. 169 మంది అధికారులు, 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని హైడ్రాకు కేటాయింపు చేసినట్లు మంత్రులు తెలిపారు. ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయని.. 51 గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్‌లో విలీనం చేస్తున్నట్లు కూడా చెప్పారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం ఆలైన్మెంట్ ఖరారుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆర్అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ వేస్తున్నట్లు చెప్పిన మంత్రులు.. కమిటీ కన్వీనర్‌గా ఆర్అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారని వివరించారు. మనోహరాబాద్ లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
మరోవైపు 8 మెడికల్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం.. 3 వేలకుపైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు కూడా కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్ కు 34 మంది సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కోస్గి ఇంజినీరింగ్ కాలేజీ, హకీంపేటలో జూనియర్ కాలేజీలు మంజూరుకు కూడా తెలంగాన కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రులు వెల్లడించారు.