తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే వివాదం చెలరేగడంతో తిరుపతి వేంకటేశ్వర ఆలయంలో శాంతి హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో చేపనూనె, బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ కలిపినట్లు ల్యాబొరేటరీ నివేదిక వచ్చింది. లక్షలాది మంది భక్తులు తిన్న లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారు. ఈ నేపథ్యంలో బాలాజీ సన్నిధానంలో శుద్ధి, హోమాలను నిర్వహించారు. తిరుపతిలో ఉన్న అర్చకుల బృందం ఆలయ ప్రాంగణంలో మహా శాంతి హోమం నిర్వహించారు. హిందువుల పుణ్యక్షేత్రమైన తిరుపతికి ఉన్న కళంకాన్ని తొలగించాలని స్వామివారిని వేడుకున్నారు. లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు కార్యనిర్వహణాధికారి శ్యామలరావు తెలియజేస్తూ సుమారు 4 గంటల పాటు శాంతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రతువులు సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యాయి. లడ్డూ ప్రసాదాల తయారీలో వంటశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. లడ్డూ ప్రసాదం తయారీకి ఆవు నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని నిర్ణయించిన టీటీడీ.. కొనుగోలు ప్రక్రియలో కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీంతోపాటు లడ్డూల తయారీలో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాలని, రానున్న రోజుల్లో లడ్డూ ప్రసాదం రుచిని మరింత పెంచాలని నిర్ణయించారు.
తిరుమల ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని గత వారం ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన ఈ సంస్థ జూలై 17న ఇచ్చిన నివేదికను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. దీంతో పాటు ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా వెంకన్న భక్తులు ఈ విషయం బయటకు రాగానే ఆవేదన చెందారు. అదే సమయంలో ఈ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది.