ఏపీ హోమంత్రి అనిత రాష్ట్రంలో మానవ అక్రమ రావాణా భారీగా పెరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరాలతో ఎక్కువగా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి త్వరలోనే ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
విజయవాడలో కౌంటరింగ్ సైబర్ అనబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఏర్పాటు చేసిన జాతీయస్థాయి సదస్సును హోం మంత్రి అనిత గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి..రాష్ట్రంలో రోజు రోజూకూ మానవ అక్రమరవాణా పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజ్వల ఎన్జీవో, యూఎస్ కాన్సులేట్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగబోతోంది. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి జడ్జిలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రస్తుతం దేశంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ.. ఉద్యోగాలు, మ్యారేజీ బ్యూరోల ముసుగులో ఆన్‌లైన్ ద్వారా ఈ మానవ అక్రమరవాణా జరుగుతోందని హోం మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కాల్ సెంటర్ల ద్వారా విదేశాలకు కూడా మానవ అక్రమ రవాణా జరుగుతోందని అనిత చెప్పొకొచ్చారు. సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలోనూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.