సినీరంగంలో ఐఫా అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ప్రస్తుతం 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతున్న ఈ ఐఫా అవార్డుల పండగలో రెండో రోజు చిరంజీవి, ఏఆర్ రెహమన్, వెంకటేశ్, బాలకృష్ణ, సమంత, రానా, హాజరై సందడి చేశారు.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరో, హీరోయిన్లు వివిధ జాబితాల్లో అవార్డులను అందుకోగా.. టాలీవుడ్ సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ,వెంకటేశ్ చేతుల మీదుగా చిరంజీవి ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు.
ఈమధ్యే మెగాస్టార్ చిరంజీవి సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి.. చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన 46 ఏళ్ల సినీ జీవితంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ఆడియన్స్ అలరించి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగానూ మెగాస్టార్ గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగానే.. వెంటనే.. తాజాగా చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంతో మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఐఫా అవార్డుల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకోవడంతో.. బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ చిరంజీవిని అభినందించారు. ఈ సందర్భంగా చిరు, బాలయ్య ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరోవైపు ఈ వేడుకల్లో ఐఫా తరపున బాలకృష్ణ ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డుని అందుకున్నారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇక్కడ పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన 50 ఏళ్ళ నట ప్రస్థానానికి ఐఫా తనకు గోల్డెన్ లెగసి అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. నాటి తోటి స్టార్స్ తో మంచి స్పోర్టివ్ కాంపిటేషన్ ఉంటుందని..తాను దాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు.