ఇప్పుడు చాలామందికి బరువు భారంగా మారిపోయింది. ఇంట్లో ఉన్నా, బయట పనులకు వెళ్తున్నా కూడా కొంతమంది ఎక్కువగా వెయిట్ పెరిగిపోతున్నారు. బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే ఆహారం పూర్తిగా తగ్గించి ఇతర సమస్యలు కొని తెచ్చుకుంటారు. బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. అయితే అది అంత సులువు కాదు. ముఖ్యంగా నలభై దాటిన వ్యక్తులు బరువు తగ్గాలంటే కాస్త కష్టమే.
బరువు తగ్గాలనే ఆలోచనతో సరిగ్గా భోజనం చేయకపోవడం, సరైన సమయానికి లంచ్, డిన్నర్ తినకపోవడం వల్ల ప్రమాదం కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. బరువు తగ్గకపోగా బీపీ, షుగర్లు బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఆకలిని చంపడం కంటే తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం మంచిది. తక్కువ సమయం నిద్రపోయినా సమస్యే. దానివల్ల ఒత్తిడి పెరిగి ఆకలిని పెంచుతుంది.
ఇక రాత్రిపూట పొట్టను చాలా సమయం ఖాళీగా ఉంచుతాం కాబట్టి ఉదయం టిఫెన్ మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి. బేకరీ ఫుడ్, జంక్‌ఫుడ్ తినకపోవడమే మంచిది. సమతుల్యంగా ఆహారం తీసుకోవటం ఒక్కటే కాదు.. శరీరానికి వ్యాయామం కూడా అవసరమే. అయితే వాటర్‌తో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చంట. ఒక పద్ధతి ప్రకారం నీళ్లు తాగితే కచ్చితంగా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. నీళ్లు తాగడం వల్ల ఎక్కువ కష్టపడకపోయినా కేలరీలు మాత్రం కరుగుతాయని గ్యారంటీ ఇస్తున్నారు.
ప్రతి రోజూ భోజనానికి ముందు 15 నిమిషాల ముందు కడుపునిండా నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ తో తక్కువగా తింటారు. వాటర్ తాగడంతో అతిగా ఉన్న ఆకలి కాస్త తగ్గి ఎక్కువగా తినలేము. ఇలా రెగ్యులర్‌గా జరగడం వల్ల ఆటోమేటిక్ గా బరువు తగ్గడం స్టార్ట్ అవుతుంది.
ఇక మన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు, కార్బొహైడ్రేట్స్‌ను కరిగించడంలో నీళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినన్ని నీరు అందకపోతే టాక్సిన్లు పేరుకుపోతాయి. అయితే అధికంగా నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకి పోతాయని అంటున్నారు.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండరకణాలు బాగా పనిచేస్తాయి. అందువల్ల నీళ్లు ఎక్కువగా తాగడంతో పాటు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునేవారు రోజూ 4 నుంచి 6 లీటర్ల నీటిని తాగితే మంచింది. ఇలా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల.. క్యాలరీలు కరిగి వెయిట్ బాగా తగ్గొచ్చు. అందుకే వ్యాయమాలతో పాటు నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే వయస్సు, శరీరాకృతి, ఆరోగ్య స్థితిగతులను బట్టి నీళ్లు తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం నివసించే ప్రాంతం, వాతావరణాన్ని బట్టి కూడా నీరు తీసుకోవాల్సి ఉంటుంది.