ఏపీలో నేటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా… మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. లాటరీ పద్ధతి ద్వారా నిన్న మద్యం దుకాణాలను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నవారు దుకాణాలు తెరిచారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ తెరిచి ఉంటాయి. మద్యం షాపుల కోసం ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఆన్ లైన్లో దరఖాస్తులు వచ్చాయి. అమెరికాతో పాటు మరి కొన్ని దేశాల నుంచి కూడా అప్లికేషన్లను వేశారు.
నిబంధనల మేరకు చాలాచోట్ల షాపులు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు. సిండికేట్‌తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు తమ లైసెన్సులను ఇతరులకు ఇచ్చేందుకు బేరసారాలు జరుపుతున్నారు. చాలా షాపులు చేతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త మద్యం విధానంలో భాగంగా ఇప్పటి వరకు నడుస్తున్న ప్రభుత్వ షాపులు మూతపడ్డాయి. వీటిలోని సరకును వ్యాపార సమయం ముగిసిన తర్వాత మద్యం డిపోల అధికారులు, సిబ్బంది లెక్కించారు. సరకును బుధవారం ఉదయం నుంచి సాయంత్రంలోగా సంబంధిత డిపోలకు చేరుస్తారు.
వాకిన్‌స్టోర్లలోని సరకును తరలిస్తారు. ప్రైవేటు షాపులు తెరిచినా, తెరవకపోయినా ప్రభుత్వ దుకాణాలను అన్ని చోట్లా మూసి వేశారు. షాపులు దక్కించుకున్న వారు నిబంధనల ప్రకారం వార్షిక లైసెన్సు రుసుములో ఆరో వంతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. దుకాణదారులు ఈ మొత్తాన్ని చెల్లించడంతో తాత్కాలిక లైసెన్స్ జారీ చేశారు. ఇది ఈనెల 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. షాపులను అద్దెకు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాటు అమలులో ఉండే పూర్తిస్థాయి లైసెన్స్ ఇస్తారు. ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.