అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. అమెరికాలోని వలసల వ్యవస్థపై ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ అభ్యర్థి అయిన కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై తొలి సంతకం చేస్తానని అన్నారు.
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమస్య ప్రధానమైనదని చెప్పుకొచ్చిన కమలా హారిస్.. ఈ సమస్య పరిష్కారంపై తాము దృష్టి సారించామని అన్నారు. తాను అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై తొలి సంతకం చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఈ బిల్లులో వలసల సమస్య పరిష్కారానికి వనరులు పెంచడంతో పాటు.. ఎక్కవమంది న్యాయమూర్తులను నియమించడం, జరిమానాలు కఠినతరం చేయడం వంటి ఎన్నో అంశాలు ఉంటాయని అన్నారు.
సరిహద్దులను బలోపేతం చేయడానికి కాంగ్రెస్‌లోని సంప్రదాయ సభ్యులతో పాటు ద్వైపాక్షిక ప్రయత్నానికి మద్దతుగా 1,500 మంది బోర్డర్ ఏజెంట్లను నియమిస్తామని కమలా హారిస్ చెప్పారు. ఇది అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు, సరిహద్దుల వెంబడి అమెరికాలోకి వస్తున్న మాదక ద్రవ్యాలను నిరోధించడానికి ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మరో కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ సమస్యను పరిష్కరించగలిగే అధ్యక్షుడు ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని హారిస్ పేర్కొన్నారు.
ఇటీవల యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని కమలాహారిస్ సందర్శించారు. ఆ సమయంలో అక్రమ వలసలను నివారించడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు. మరోవైపు కమలా హారిస్ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. నాలుగేళ్లుగా సరిహద్దు వద్దకు వెళ్లని కమలా హారిస్‌కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందా అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. హింసాత్మక మూకలు అమెరికాలో ప్రవేశించి హత్యలు, అత్యాచారాలు చేస్తున్నా.. పదవిలో ఉండి కూడా ఆమె పట్టించుకోలేదని ట్రంప్ మండిపడ్డారు. చిన్న పట్టణాలను కమలా హారిస్ శరణార్థి శిబిరాలుగా మార్చేశారంటూ ట్రంప్ ఆరోపించారు.