పై నుంచి వరద పెరగడంతో నాగార్జునసాగర్ నీటి సామర్థ్యం గరిష్ఠస్థాయికి చేరుకుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలుతున్నారు. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. అధికారులు ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లు ఎత్తి 2 లక్షల 2 వేల క్యూసెక్కుల నీటిని కింది విడుదల చేస్తున్నారు. అలాగే సాగర్ కూడి కాలువకు 6 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 6 వేల క్యూసెక్కుల నీరును వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 28 వేల క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 2 వేలక క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఆదివారం నాగార్జునసాగర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీగా పర్యాటకులు వచ్చారు. పారుతున్న నీటిని చూస్తూ ఎంజాయ్ చేశారు. బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం, సమ్మక్క సారక్క, ప్రధాన డ్యాం, శివాలయం ఘాట్, పవర్‌హౌస్, అనుపు, కొత్త వంతెన, పాత వంతెన, ప్రధాన గేట్లు, కొత్త బ్రిడ్జి వద్ద పర్యాటకుల రద్ది కనిపించింది. పర్యాటకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ బస్సులు నడుపుతోంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. వారం రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ ఫ్లో శనివారం మరింత పెరిగింది. 75వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 85,356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అటు తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో 8 గేట్లు ఎత్తివేత దిగువకు దాదాపు 60,000 క్యు సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజ్‌కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద వచ్చి చేరుతోంది. స్పిల్‌వే ఔట్ ఫ్లో 22 గేట్లు ఎత్తిన అధికారులు 93,324 క్యూషక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి 84,297 క్యూసెక్కుల నీరు వస్తోంది.