రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, వైసీపీ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల ఏపీలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడుల పై కొందరు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ మహిళా నేత యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ఆమె ప్రశ్నలు వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే ఆయన ఎందుకు పరామర్శించలేదని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. బాధిత కుటుబాన్ని పరామర్శించే బాధ్యత మన డిప్యూటీ సీఎంకు లేదా అంటూ పవన్ కల్యాణ్‌ను శ్యామల నిలదీశారు. దళిత వర్గానికి చెందిన అమ్మాయి అని చిన్న చూపు చూస్తున్నారా అంటూ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.
30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఎన్నికల్లో ప్రచారం చేసి నిరంతరం జగన్ పై ఆరోపణలు చేశారు. ఏపీలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు అని యాంకర్ శ్యామల ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ ప్రభుత్వంలో చిన్నవాటిని భూతద్దంలో చూపించిన నాయకులు, ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని శ్యామల ప్రశ్నించారు.. ఈ రాష్ట్రంలో బాలికలపైన, ఆడపిల్లలపైన మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరమని , ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనం వల్లే జరుగుతున్నాయని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఈ రాష్ట్ర చరిత్రలో ఈ నాలుగు నెలలోనే జరిగినన్నీ దారుణాలు ఎప్పుడు కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.