వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారి పోతున్నారు. బుధవారం ఎవరూ ఊహించని విధంగా వైసీపీ సీనియర్ నాయకురాలు, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపికి బైబై చెప్పారు. బయటకు వెళుతూ అన్ని రోజులూ తాను అణగదొక్కుకున్న కక్కసునంతా వెళ్లగక్కి.. భారీ రాళ్లనే జగన్‌పైకి సంధించారు. కాగా..ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన మరో వైసీపీ కీలక నాయకురాలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత అయిన మేకతోటి సుచరిత అతి త్వరలో జగన్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుుగతోంది.
అయితే ఈ నిర్ణయం ఆమె ఇప్పుడు తీసుకున్నది కాదు. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడినపుడే ఆమె వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. అయితే ఇంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు పార్టీని వీడి కూటమిలోని ఒక పార్టీలోకి వెళ్లడానికి రూట్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆమె వైసీపీ ముఖ్య నాయకురాలే కాదు, జగన్ అంటే తమ కుటుంబానికి ఆరాధ్యదైవమని కుటుంబ సమేతంగా మీడియా ముందుకు నొక్కివక్కాణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మేకతోటి సుచరిత తర్వాత.. జగన్ వెంట నడిచారు.జగన్ ఇంట్లో ఒక మనిషిగా ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా కూడా మారిపోయారు.
ఈ విషయాన్ని సుచరిత కుటుంబం స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పుకొంది. అయితే.. రాజకీయాలలో ఇవన్నీ రెండో చాయిస్ అన్న విషయం తెలిసిందే. అయితే మూడేళ్లుగా ఆమెకు, ఆమె కుటుంబానికి జగన్‌పై ప్రేమ తగ్గుతూ వచ్చింది. దీనికి బలమైన కారణం కూడా ఉంది. తొలి హోం మంత్రిగా ఎస్సీ నాయకురాలిగా ఉన్న సుచరితకు అవకాశం ఇచ్చిన జగన్..రెండున్నరేళ్లకు ఆమెను తొలగించి.. మరో ఎస్సీ నాయకురాలికి అదే పదవిని ఇవ్వడాన్ని సుచరిత ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. అప్పటి నుంచీ మెల్లమెల్లగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె..ఎన్నికల సమయానికి.. మరింత దూరంగా ఉంటూ వచ్చారు.
సుచరితను ఆమె సొంత నియోజకవర్గమైన ప్రత్తిపాడు నుంచి గుంటూరులోని తాడికొండ నియోజకవర్గానికి మార్చడం కూడా ఆమెకు నచ్చలేదు. అందుకే ముందు అసలు టికెట్ తీసుకోవడానికి కూడా సుచరిత మొగ్గు చూపలేదన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. ఆ సమయంలో జనసేన పార్టీలోకి వెళ్లడానికి ఆమె ప్రయత్నించారు. కానీ సుచరిత భర్త సూచనలతో వైసీపీలోనే ఉండిపోయారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సుచరిత ఘోరంగా ఓడిపోవడంతో..అప్పటి నుంచి సుచరిత పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె ఓ కీలక పార్టీతో చర్చలు జరుపుతున్నారని..అక్కడ గ్రీన్ సిగ్నల్ రావడంతో..త్వరలోనే పార్టీ మారడం గ్యారంటీ అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మరి చూడాలి ఈ వార్తలు ఎంత వరకూ నిజం అవుతాయో.