ఈమధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మహిళలు, వృద్ధులు టార్గెట్‌గా ఎక్కువ శాతం నేరాలు జరుగుతున్నట్లు సైబర్ పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు సవాల్ విసురుతుంది. పోగొట్టుకున్న నగదుని రికవరీ చేయడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అయితే ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే మాత్రం బాధితులకు చాలా వరకు న్యాయం జరుగుతోందని సైబర్ పోలీసులు అంటున్నారు.
క్రిమినల్స్‌కు చెందిన బ్యాంకు అకౌంట్స్ ఫ్రీజ్ చేసి.. బాధితుల నగదును రిటర్న్ చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. గోల్డెన్ అవర్’లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారా 40 కోట్లు రూపాయలను బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు.
నేరం జరిగిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. అందుకే బాధితులు ‘గోల్డెన్ అవర్’లోనే అప్రమత్తమయి వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.ఆ తర్వాత ఆలస్యమైన ఒక్కో నిమిషం కూడా నగదు వెనక్కు వచ్చే అవకాశాలను అంతే కోల్పోయినట్లు అవుతుందని అంటున్నారు.
సైబర్ నేరాలు జరిగిన వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అనుకోకుండా ..ముందుగా గోల్డెన్ అవర్లోనే 1930 నంబర్‌కు కాల్ చేసి కానీ లేదా cybercrime.gov.inకు కానీ తమ ఫిర్యాదు నమోదు చేయాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్ లేదా ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంకు అకౌంట్లను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంతో.. మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు ఫేక్ వివరాలతో తెరిచిన బ్యాంకు అకౌంట్లను వాడతారు.
ఓ నేరం కోసం ఒకే అకౌంట్‌ను కాకుండా వరుస పెట్టి బదిలీ చేసుకుపోవడానికి చాలా అకౌంట్లను వాడుతుంటారు. కాబట్టి ఈ సమయంలో మొత్తం డబ్బులు పోగొట్టుకోకముందే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే ముందుగా.. అధికారులు బాధితుల అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆన్లైన్ ఫ్రీజింగ్ అంటారు.
సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అప్పటికే కొంత నగదు మరో అకౌంట్లోకి వెళ్లినట్లు తేలితే ఆయా బ్యాంకుల సహకారంతో..ఆ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆఫ్‌లైన్ ఫ్రీజింగ్ అంటారు. గతేడాది మొత్తమ్మీద రిఫండ్ అయిన మొత్తం 20.86 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఇది రూ.32.49 కోట్లకు చేరింది. అక్టోబర్ రిఫండ్‌తో కలిపితే ఇది సుమారు రూ.40 కోట్ల వరకు ఉందని పోలీసులు చెబుతున్నారు.