ఆముదం లేదా కాస్టర్ ఆయిల్ మన సంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగించే ముఖ్యమైన ఔషధం అని తెలిసిన విషయమే. ఆముదం ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు, కేశారోహిత్యం వంటి అనేక ఆరోగ్య సమస్యలను బయట పడేస్తుందని నిపుణులు అంటున్నారు.ఆముదాన్ని సౌందర్య సాధనంగా కూడా వాడొచ్చట.
ఆముదం మంచి విరేచన మందుగా ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. పేగు సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి ఆముదం ఒక శక్తివంతమైన ఔషధం. దీనిలో ఉండే రిసినోలిక్ ఆమ్లం పేగులోని మలాన్ని సాఫీగా బయటకు వెళ్లేలా చేస్తుంది. అందుకే ఉదయాన్నే ఒక టీస్పూన్ ఆముదం తీసుకుంటే జీర్ణం సులభంగా జరిగి, మోషన్ ఫ్రీగా అవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఆముదం చర్మ సంరక్షణలో కూడా ఒక అద్భుతమైన సహజ ఆయిల్ గా పనికొస్తుంది. ఇది చర్మాన్ని తేమతో నింపి, పొడిబారకుండా కాపాడుతుంది. స్కిన్ పై ప్రతి రోజు ఆముదం రాసి మసాజ్ చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. చర్మంలోని మొటిమలు, చర్మవ్యాధులు, మచ్చలను తగ్గించడంలో ఆముదం ది బెస్ట్ అంటారు. ఆముదంలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై అనేక రకాల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
కేశాల సంరక్షణలో కూడా చాలామంది ఆముదాన్ని ఉపయోగిస్తారు. దీనిలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు, గట్టిపడటానికి సహాయపడతాయి. కుదుళ్లకు ఆముదాన్ని రాసి మసాజ్ చేస్తే జుట్టు త్వరగా ఎదుగుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఆముదాన్ని వాడటం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు.
ఆముదాన్ని కీళ్లనొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వలన కీళ్లలో నొప్పి, వాపును తగ్గించడంలో ఆముదం సహాయపడుతుంది.
అలాగే ఆముదాన్ని గర్భాశయ సంబంధిత సమస్యల నివారణకు కూడా ఉపయోగిస్తారు. ఇది మెన్స్ట్రువల్ సైకిల్‌లో వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట. దీన్ని కడుపుపై మసాజ్ చేస్తే.. పీరియడ్స్ టైముకు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పారు.
పాదాల పగుళ్లు, చర్మం పొడిబారడం వంటి సమస్యలున్నవారు ఆముదాన్ని రోజూ మర్ధన చేయాలి. ఆముదంలో మంచి తేమతో కూడి ఉండటం వల్ల, పాదాలపై రాసి మసాజ్ చేస్తే పాదాల పగుళ్లు త్వరగా మాయమవుతాయి.అలాగే చర్మంలోకి లోతుగా వెళ్లి, పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చడంలో ఆముదం బాగా ఉపయోగపడుతుంది.