ఏపీలో నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ సరిగ్గా ఒకటో తారీఖునే పెన్షన్‌దారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో నేడు తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందించారు. పలు కారణాలతో ఇవాళ పెన్షన్ అందుకోలేని వారికి రేపు అందించనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 29.83 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. ఈ నెల పింఛను దారుల కోసం ప్రభుత్వం రూ.2,710 కోట్లను విడుదల చేసింది. ఈరోజే వంద శాంత పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యేలా సర్కార్ ఏర్పాట్లు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారు. సరిగ్గా ఒకటవ తేదీనే పెన్షన్ రావడంతో వృద్ధులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించేందుకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభ ద్వారా ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడనున్నారు. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అర్హులైన వారికి ఉచిత గ్యాస్ ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పుడు దీపం-2 పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లను అందించనున్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపై గ్యాస్ భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకటి చొప్పున పంపిణీ చేయనున్నారు.