నేటి నుండి కార్తీకమాసం మొదలైంది. కార్తీక మాసం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వేలాది మంది భక్తులు శివుని గుడికి వెళ్తున్నారు. శివయ్యను దర్శించుకొని… కార్తీక మాసం పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది.
కార్తీకమాస దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ… ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు నుంచి డిసెంబర్ 01 వరకు అన్ని ఆలయాల్లో కార్తీకమాస దీపోత్సవాలు నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ సా.6-8 గంటల వరకు దీపోత్సవ వేడుకలు చేయాలని, పాల్గొనే వారికి 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ ఇవ్వడంతో పాటు ప్రధాన ఆలయాల్లో బ్లౌజ్ పీస్లు అందించాలన్నారు.
దీపావళి పండుగ తర్వాత కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మొదలై, మాసం మొత్తం క్రమపద్ధతిలో పూజలు, దీపాల ప్రదక్షిణలు, ఉపవాసాలు చేస్తారు. ఈ నెలను ప్రత్యేకంగా శివుడికి మరియు విష్ణువుకు అంకితం చేస్తారు, అందుకే శివపార్వతుల, విష్ణు లక్ష్మి వ్రతాలు, ఉపవాసాలు చేసుకుంటారు.
పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు గాను తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు గాను భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుతున్నామని ఆయన శనివారం తెలిపారు.