ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. తానిచ్చిన మరో హామీని కూడా నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం ఏపీలో పింఛనుదారులు ప్రతినెలా ఒకటి, రెండు తేదీలలో తమ పింఛను తీసుకుంటున్నారు. కొంతమందికి వేర్వేరు చోట్ల పింఛను ఉండటంతో.. కొన్ని సార్లు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా వచ్చి కచ్చితంగా ఒకటోతేదీ లేదంటే రెండోతేదీన పింఛను తీసుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో ఏనెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలని, లేకపోతే పెన్సన్ రద్దవుతుందనే నిబంధన తీసుకువచ్చారు.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆ విధానాన్ని రద్దుచేశారు. వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా సరే మూడో నెలలో తీసుకోవచ్చని, మూడు నెలల పింఛన్ కలిపి 12వేలు ఒకేసారి అందిస్తామని ప్రకటించారు. ఈమేరకు చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో పింఛను ఇలాగే ఇచ్చేవారు. ఒక నెలలో తీసుకోకపోయినా తర్వాత నెలలో తీసుకునే వెసులుబాటు ఉండేది. దీన్ని జగన్ ప్రభుత్వం రద్దుచేయడంతో పింఛనుదారులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో పర్యటించిన సీఎం చంద్రబాబు పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.
నవంబరు నెలలో పింఛను తీసుకోలేనివారికి డిసెంబరులో పింఛన్ అందజేయనున్నారు.అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై పింఛనుదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలలో చాలామంది ఉంటున్నారు. వీరంతా చంద్రబాబు పాత విధానాన్ని పునరిద్ధరిస్తూ తన హామీని నిలబెట్టుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీనెలా వచ్చిన పెన్షన్ అంతా బస్సు ఖర్చులకే పోతుందని..ఇలా అయితే నెలా నెలా తిరిగే బాధ ఉండదని అంటున్నారు. కాగా ఎన్నికల సమయంలోనే చంద్రబాబు దీనిపై హామీ ఇచ్చారు.