అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మ్యాజిక్..

Trumps Magic In US Election

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం అయ్యింది. ఫలితాలు చూస్తే రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. పలు రాష్ట్రాల్లో హరాహోరీ పోటీ నడుస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. విజయం దిశగా దూసుకుపోతున్నారు. ట్రంప్ ఇప్పటికి 247 ఎలక్టోరల్ ‘ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు కమలా హారిస్ అధ్యక్ష రేసులో వెనకబడిపోయారు. ఆమె ఇప్పటివరకు 214 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే సొంతం చేసుకున్నారు.

స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ మేజిక్ కొనసాగింది. అధ్యక్ష పదవి దక్కాలంటే ట్రంప్ కు మరో 24 ఓట్లు రావాలి. అదే సమయంలో కమలా హ్యారీస్ కు 60 వరకు అవసరం. ఇక, అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్స్ లో ఏడు రాష్ట్రాల్లో ఆరు చోట్ల ట్రంప్ ఆధిపత్యం కొనసాగింది. ఇదే ఇప్పుడు ట్రంప్ కు కలిసొచ్చే అంశంగా మారింది. పలు రాష్ట్రాల్లో సర్వే సంస్థల అంచనాలు సైతం తారు మారు అయ్యాయి. దీంతో, ట్రంప్ కు 24 సీట్లు దక్కితే గెలుపు ఖాయమైనట్లే. ట్రంప్ మద్దతు దారులు తమ గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అదే విధంగా డెమోక్రాట్లు కౌంటింగ్ పైనే ఫోకస్ పెట్టారు. మరి కాసేపట్లో ట్రంప్, కమలా హ్యారీస్ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేరుగా అధ్యక్షులను ఎన్నకోవడం ఉండదు. ప్రెసిడెంట్ను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజ్ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజ్ లో మొత్తం 538 ఓట్లు ఉంటాయి. ఇందులో 270కి పైగా ఓట్లు సాధించిన వ్యక్తులు ప్రెసిడెంట్ అవుతారు. అయితే అభ్యర్థులకు సమానంగా ఎలక్ట్రోరల్ కాలేజ్ సీట్లు వస్తే.. ప్రెసిడెంట్ను ప్రతినిధుల సభ ఎంపిక చేస్తుంది. ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ప్రజాస్వామ్య స్థితి, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటి అంశాలు ఈసారి అమెరికన్ ఓటర్లకు అత్యంత ముఖ్యమైనవిగా నిలిచాయి.

కాగా ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమొక్రాట్ సుహాస్ సుబ్రమణ్యం మంగళవారం వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లోని US ప్రతినిధుల సభ ఓపెన్ సీటును గెలుచుకున్నారు. గత జూన్‌లో రద్దీగా ఉండే ప్రైమరీలో డెమోక్రటిక్ అభ్యర్థిత్వాన్ని సాధించి రిపబ్లికన్ మైక్ క్లాన్సీని సుబ్రమణ్యం ఓడించారు.