ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. 15 రోజులుగా గాలి నాణ్యత సూచీ అధ్వానంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బుధవారం ఉదయం కూడా చాలా పేలవమైన స్థాయిలో గాలి నాణ్యత నమోదైంది.
బుధవారం ఉదయం 8 గంటల సమయంలో.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 361గా నమోదయినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 400 మార్క్‌ను కూడా దాటింది. అదే సమయంలో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెబుతున్నదాని ప్రకారం.. ఆయా నగర్‌లో అత్యధికంగా గాలి నాణ్యత సూచీ 417గా నమోదయినట్లు తేలింది. ఇది తీవ్రమైన కేటగిరీ కిందకు వస్తుంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 396గా నమోదవగా, జహంగీర్‌పురిలో 389, ఐటీవోలో 378, ఎయిర్‌ఫోర్ట్ ప్రాంతంలో 368గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదయినట్లు అధికారులు చెప్పారు.
గాలి నాణ్యతకు తోడు ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టుముట్టడంతో.. చాలా ప్రాంతాలలో దృశ్యమానత దారుణంగా పడిపోయింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో అయితే విజిబిలిటీ జీరోగా నమోదవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీతోపాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ పరిసర ప్రాంతాలను కూడా దట్టమైన పొగ మంచు ఆవహించింది. పొగమంచు వల్ల ఈ ఉదయం రైలు, విమాన రాకపోకలపై అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం పొగమంచు వల్ల రోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి ఎదురవడంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.