బీజేపీ ఎంపీ ధర్మపురి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై విరుచుకుపడ్డారు. అర్వింద్ మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటనలో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి, ఈసంపల్లిలో తనపై జరిగిన దాడికి కేటీఆర్ బాధ్యత వహించాలని, ఈ వ్యవహారంపై పార్లమెంటు ప్రివిలైజేషన్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించినా, కేటీఆర్‌లో కొవ్వు తగ్గలేదని విమర్శించారు. కేటీఆర్‌ను జైల్లో వేస్తేనే ఆయనలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.
కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి, తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తానని ట్వీట్ చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, పార్టీలను ఐదేళ్లకు ఒకసారి ప్రజలు ఎన్నుకుంటారని, పని చేయకపోతే ప్రజలే కిందికి దించే హక్కు ఉందని అన్నారు. లగచర్ల, ఈసంపల్లి ఘటనలను పూర్తిగా విచారించి, కేటీఆర్‌ను జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఆయన చెల్లి కవితను జైల్లో పెట్టినట్లే కేటీఆర్‌ను కూడా లోపలికి పంపించి, కొవ్వు కరిగించాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 38సీట్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీని KTR ను నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరముందన్నారు. ఇక ఈ ఘటనపై హైదరాబాద్ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ, దాడి వెనుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాత్ర ఉందని, ఆయనను విచారణకు తీసుకునేందుకు కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.