అన్నదాతలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలోనే రైతు భరోసా మొదటి విడత నిధులు జమచేస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం 72 వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించామని చెప్పారు.తాజాగా నిర్మల్ జిల్లాలోని భైంసాలో మహారాష్ట్ర ఎన్నికలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కూడా తమ ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మంత్రి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో కొత్తరేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
తమ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా స్వీకరించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోందని పొంగులేటి చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తర్వాత.. బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్‌కార్డులు కూడా రైతులకు అందిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. దీనికోసం ప్రతి ఒక్కరు కులగణన సర్వేకు సహకరించాలని ఆయన కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్కసారి మాట ఇస్తే మడమతిప్పదని.. రాహుల్ గాంధీ మన దేశ ప్రధాని కాగానే తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మరోవైపు, వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో ఎంతటివారున్నా సరే వారిని వదిలే ప్రసక్తే లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పరంగా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.