నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. పురుషులు ఎదుర్కొనే సమస్యలపై చర్చించుకోవడానికి జరుపుకొనే స్పెషల్ డేగా దీనిని జరుపుకొంటున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వివిధ బాధ్యతల వల్ల తమపై ఉండే ఒత్తిడి గురించి మహిళలు షేర్ చేసుకునేంతగా .. పురుషులు ఓపెన్‌గా చెప్పుకోలేరు.
తమ ఒత్తిడి గురించి ఇతరులకు చెబితే.. వారు తమను తక్కువ చేసి చూస్తారనే ఆందోళన ఎక్కువగా పురుషుల్లో అంతర్గతంగా ఉంటుంది. దీనివల్ల లోలోపల కుమిలిపోతూ పురుషులు తమ మానసిక ఆరోగ్యాన్ని చేతులారా దెబ్బతీసుకుంటారని అందుకే ఆల్కహాల్ వంటి అలవాట్లకు బానిస అవుతూ ఉంటారని అంటారు. దీనికి చెక్ పెట్టడానికి కుటుంబం నుంచి పురుషులకు బలమైన నైతిక మద్దతు లభించాలని చెబుతారు.
సామాజిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాల ప్రభావంతో పురుషుల్లో చాలాసార్లు కోపం, చిరాకు, ఆందోళన వంటివి కనిపిస్తుంటాయి. అందుకే వీటికి చెక్ పెట్టడానికి ‘పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్’అనేది 2024 సంవత్సరానికి ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’ థీమ్ ను తీసుకువచ్చారు. పురుషుల మానసిక ఆరోగ్యం, వారికి మద్దతునిచ్చేలా సామాజిక పరిస్థితులను ఏర్పాటు చేయడమే ఈ థీమ్ లక్ష్యం.
పురుషుడు నిత్యం తన కుటుంబం గురించి నిత్యం ఆలోచిస్తూ.. వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. అతను నిత్యం శ్రమిస్తూ.. కుటుంబం కోసం ఎంతగా కష్టపడినా.. పురుషులు చేసే శ్రమకు సమాజంలో ఎక్కువగా గుర్తింపు ఉండదన్న ఫీలింగ్ లో ఉంటారు. నాన్నగా, కొడుకుగా, తమ్ముడిగా, అన్నగా, భర్త గా ఎన్నో పాత్రలను పురుషుడు బ్యాలెన్స్‌డ్‌గా పోషించినపుడే అతనిలో పరిపూర్ణత్వం కలిగి ఉంటుంది.
కానీ ఈ విషయంలో చాలామంది ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పుతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఈవిధంగా జరగకూడదంటే కుటుంబం వైపు నుంచి, సమాజం వైపు నుంచి ప్రతీ మగాడికి కనీస నైతిక మద్దతు లభించాలని మానసిక నిపుణులు కోరుతున్నారు.