అగ్ర రాజ్యం అమెరికాను బాంబ్ తుఫాన్ హడలెత్తిస్తోంది. అత్యంత శక్తివంతమైన సైక్లోన్ చాలా రాష్ట్రాలపై ప్రభావం చూపించనున్నట్లుగా తెలుస్తోంది.ఈ ప్రభావంతో.. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.బలమైన గాలుల వల్ల.. తీవ్ర ప్రళయం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో భారీ విలయాన్ని సృష్టించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
కాలిఫోర్నియా సహా ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. సుమారు 8 ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది.1980లలో బాంబ్ సైక్లోన్ అనే పదాన్ని వాతావరణ శాఖ పెట్టింది. వెచ్చని, తేమతో కూడిన ఉష్ణమండల గాలి వల్ల ఈ తుఫాన్ బలపడుతుంది. బాంబ్ సైక్లోన్ అనే పదం బాంబోజెనిసిస్ అనే పదం నుంచి వచ్చింది.
గంటల వ్యవధిలోనే తుఫానుగా బలపడటాన్ని బాంబ్ సైక్లోన్‌గా పిలుస్తారు. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలోన కనీసం 24 మిల్లీబార్లు కానీ.. అంతకంటే ఎక్కువ కానీ వాతావరణ పీడనం పడిపోవడాన్ని బాంబ్ సైక్లోన్‌గా వాతావరణ శాఖ పరిగణిస్తుంది. హరికేన్ స్థాయిలో గాలులు వీయడంతో పాటు అదే భారీ స్థాయిలో వర్షపాతం కూడా నమోదవుతుంది.
ఇక బుధవారం,గురువారం మధ్య సమీపించే తుఫాను 24 గంటల్లో 50 నుంచి 60 మిల్లీబార్‌ల వరకు పీడనం తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సోమవారం రాత్రి 1000 మిల్లీబార్లకుపైగా ప్రారంభమైన ఈ పీడనం మంగళవారం రాత్రికి 950 మిల్లీబార్లకు దిగువకు పడిపోయినట్లు చెబుతున్నారు. దీంతో అమెరికాలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.