హైదరాబాద్ నందినగర్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటీఆర్) భేటీ గురువారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో వీరిద్దరు దాదాపు 30 నిమిషాలపాటు కీలక చర్చలు జరిపారు. బీఆర్ నాయుడు, కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయుడు స్వామివారి తీర్థప్రసాదాలను కేటీఆర్‌కు అందించారు. కేటీఆర్ కూడా ఆయనకు శాలువా కప్పి శ్రీ వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు. నూతన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు బీఆర్ నాయుడుకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భక్తుల కోసం కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా నాయుడును అభ్యర్థించారు. అదేవిధంగా, కరీంనగర్, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు వేగంగా పూర్తిచేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన ఆలయాల అభివృద్ధికి టీటీడీ తరఫున పూర్తి సహకారం అందించాలని కేటీఆర్ కోరారు. దీనిపై బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఆలయాల అభివృద్ధికి, భక్తుల దర్శన సౌకర్యాలకు అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
టీటీడీ పాలక మండలి కొత్త బృందం
ఇటీవల టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. 24 మంది సభ్యులతో కూడిన పాలక మండలి పేర్లను టీటీడీ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ నాయుడు 54వ టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ భేటీతో బీఆర్ నాయుడు, కేటీఆర్ మధ్య చోటుచేసుకున్న చర్చలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.