జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల వినూత్నమైన జాబ్ ఆఫర్ ప్రకటించారు, ఇది సాధారణ ఉద్యోగ ఆఫర్లకు పూర్తిగా విభిన్నంగా ఉంది. సాధారణంగా కంపెనీ ఉద్యోగులకు జీతం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు, జీతం లేకుండా ఏడాది పాటు పని చేయడమే కాకుండా, రూ. 20 లక్షల మొత్తాన్ని విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఉద్యోగం వివరాలు
ఈ ఆఫర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (Chief of Staff) పోస్టుకు సంబంధించింది. ఈ ఉద్యోగానికి మొదటి ఏడాది అభ్యర్థికి జీతం ఉండదు. ఎంపికైన అభ్యర్థి, జొమాటోతో కలిసి పనిచేస్తున్న ఫీడింగ్ ఇండియా అనే ఎన్జీఓకు రూ. 20 లక్షలు విరాళంగా ఇవ్వాలి.
రెజ్యూమ్ అవసరం లేదు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెజ్యూమ్ పంపాల్సిన అవసరం లేదు. కేవలం 200 పదాల్లో తమ గురించి వివరాలు [email protected]కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగి రెండో ఏడాది నుంచి రూ. 50 లక్షల వార్షిక ప్యాకేజీ పొందుతారు.
ఆఫర్ వెనుక ఉద్దేశం
ఈ ఆఫర్‌తో అభ్యర్థుల వద్ద ఉన్న సామర్థ్యాలను పరీక్షించి, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తిని ప్రోత్సహించడమే లక్ష్యమని గోయల్ తెలిపారు. ఎలాంటి అనుభవం అవసరం లేకపోయినా, సృజనాత్మకత, సేవాభావం ఉన్నవారు ఈ ఉద్యోగానికి అనువుగా ఉంటారని పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థి జొమాటో గురుగ్రామ్ ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అదనంగా, జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్ మరియు ఫీడింగ్ ఇండియా వంటి సంస్థల కార్యకలాపాలకు తోడ్పడాల్సి ఉంటుంది.
ఈ ఆఫర్‌పై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ. 20 లక్షలు చెల్లించడం న్యాయమా అన్న ప్రశ్నలతో పాటు, దీని వెనుక ఉన్న ఉద్దేశం గురించి చర్చ జరుగుతోంది. కొందరు దీనిని కొత్తదనం, వినూత్నతగా అభిప్రాయపడగా, మరికొందరు సవాల్‌గా భావిస్తున్నారు.
గోయల్ స్పష్టీకరణ
అభ్యర్థులు ఈ ఉద్యోగం ద్వారా వ్యక్తిగత అభివృద్ధిని పొందడంతో పాటు, సామాజిక సేవకు తోడ్పడతారని గోయల్ అభిప్రాయపడ్డారు. అతని ప్రకటన ఇప్పుడు వైరల్ అవుడంతో పాటు విస్తృత చర్చకు దారితీస్తోంది.
Update: I am looking for a chief of staff for myself. pic.twitter.com/R4XPp3CefJ
— Deepinder Goyal (@deepigoyal) November 20, 2024