విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని శరవేగంగా జరపడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దీనిలో భాగంగానే భోగాపురంలో నిర్మిస్తున్న ఈ ఎయిర్ పోర్టుకు మన్యం వీరుడు ..అల్లూరి సీతారామరాజు పేరును ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది .
తాజాగా శాసనసభలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంతో పాటు.. పక్కనే ఆయన స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును తాజాగా శాసనసభ ఆమోదించింది. శాసనమండలిలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది.
భోగాపురం ఎయిర్ పోర్టుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అల్లూరి సీతారామరాజు పేరును ప్రతిపాదించారు. దీనికి శాసనసభలో సభ్యులు ఆమోదం తెలిపారు. పార్లమెంటులో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలను పెట్టాలని భావించామని చెప్పిన సీఎం చంద్రబాబు.. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెడతామని.. అవసరమైతే తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు గొప్ప పోరాట యోధుడిగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని..నాడు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని ఏపీ సీఎం గుర్తు చేశారు . దేశం కోసం పోరాడిన ఇలాంటి వీరులందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు.
నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఎన్డీఏలో టీడపీ కీలక భాగస్వామి కావడం, టీడీపీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎంపిక కావడం ఏపీకి కలిసి వచ్చింది. దీంతోనే ఇక్కడి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరగడానికి అవకాశం ఏర్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2026 నాటికి ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్స్ ఎగరాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తున్న మంత్రి రామ్మోహన్ నాయుడు..ఇక్కడి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
అంతేకాకుండా విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కూడా నిర్మితమవుతోంది. ఇంకోవైపు భారత నావికా దళానికి సంబంధించిన ఆయుధ డిపో ఏర్పాటుకు సైతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా జాతీయ సంస్థలన్నీ ఉత్తరాంధ్రలో కొలువుతీరుతుండటంతో ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఉత్తరాంధ్ర కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కు మన్యం వీరుని పేరు పెడితే రాజకీయంగా కలిసి వస్తుందని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది. పైగా జగన్ గత ఐదేళ్లుగా కుటుంబ సభ్యుల పేర్లతో అన్ని ప్రాంతాలను నింపేశారు. దానికి చెక్ చెబుతూ ఇప్పుడు మహనీయుల పేర్లను పథకాలకు, ప్రాంతాలకు పెడుతోంది కూటమి ప్రభుత్వం.
,,