కౌన్ బనేగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనే అంశంపై ఉత్కంఠ వీడుతోంది.కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు బీజేపీ నేతలు తెరదించబోతున్నారు. దీంతో ఫడ్నవీస్‌కు లైన్ క్లియర్ అవుతోంది.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో.. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఎవరూ ఊహించని విజయాన్ని సాధించింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్‌సీపీ 41 స్థానాల్లో విజయాన్ని సాధించాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమే అయినా ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 27తో ముగిసిపోయింది. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు.. ఏక్‌నాథ్‌షిండేను సీఎం రేసు నుంచి తప్పించి.. ఈ విషయాన్ని ఆయన నోటితోనే చెప్పించడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు.
మహారాష్ట్ర సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా తనకు పరవాలేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే తాజాగా ప్రకటించారు. తాను ఏనాడూ పేరు కోసం పాకులాడలేదని.. బాల్‌థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్ణయిస్తారని.. ఆ నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానని అన్నారు.
ఇటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి..అఖండ విజయాన్ని అందించిన ఓటరు మహాశయులకు ఏక్ నాథ్ షిండే కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి మద్దతు తెలిపిన ప్రధానిమోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా షిండే తీసుకున్న నిర్ణయంతో ఫడ్నవీస్‌కు లైన్ క్లియర్ అయింది.