చలికాలంలో గొంతు, జలుబు, దగ్గు, శ్వాసకోశ వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాగే ఈ కాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో.. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ కాలంలో శరీరంపై చల్లటి వాతావరణం ఎఫెక్ట్ పడుతూ ఉండటంతో..శరీరానికి తగినంతగా రక్తాన్ని సరఫరా చేయడానికి, శరీరం లోపల వెచ్చగా ఉంచడానికి గుండెకు ఎక్కువగా పని ఉంటుంది.
ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో గుండెపోటు రేటు.. 53 శాతానికి పెరుగుతుందని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ చేసిన అధ్యయనంలో తేలింది. చల్లటి వాతావరణం గుండెకు ప్రమాదమని .. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి రెడ్ ఫుడ్‌ను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ధమనుల్లో బ్లాక్స్ నిరోధించడంలో సహాయపడి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
క్రాన్ బెర్రీస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు .ఎందుకంటే ఇందులో ఎన్నో సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్స్, రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉండటంతో.. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె జబ్బులను, శ్వాసకోస వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.
రెడ్ యాపిల్‌లో ఉంటున్న ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ ఒక యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ 50 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు తేల్చాయి. అంతేకాకుండా యాపిల్ లో యాంటీఆక్సీడెంట్లుగా పనిచేసే ఫ్లవనాయిడ్లు.. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.
ఎర్రదుంపలు లేదా చిలకడ దుంపలలో.. విటమిన్లు, యాంటీఆక్సీడెంట్లు, మినరల్స్, నైట్రేట్లు వంటివి అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె కండరాలను బలోపేతం చేయడంలో ఇవి ఉపయోగపడతాయి.
అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి రెడ్ క్యాబేజీ బాగా మేలు చేస్తుంది. రెడ్ క్యాబేజీ.. గుండె నాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. వీటిలో విటమిన్ – సి, కె, యాంటీఆక్సీడెంట్లు పుష్కలంగా ఉండటంతో జలుబు, దగ్గు వంటి శీతాకాల వ్యాధులు రావు. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను కూడా అదుపు చేయడంలో రెడ్ క్యాబేజ్ సహాయపడుతుంది.