బంగ్లాదేశ్, భారత్ మధ్య గ్యాప్ రోజు రోజుకూ పెరుగుతోంది. బంగ్లాలో హిందూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ హిందూ నాయకుడు అరెస్ట్ అవుతారో అనే ఆందోళన పెరుగుతోంది. దీనితో, అటు బంగ్లాదేశ్‌లోనే కాక భారత్‌లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
బంగ్లాదేశ్ వైఖరిపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. త్రిపురలో బంగ్లాదేశీయులకు భోజనం, వైద్య సేవలు బంద్ అంటూ భారీ ర్యాలీలు జరుగుతున్నాయ్. మరోవైపు, బంగ్లా-భారత్‌తో సంబంధాల్లో మార్పు వచ్చిందనీ.. తిరిగి బలోపేతం చేస్తామంటూ రెండు దేశాలూ చెబుతున్నాయి. ఇంతకీ బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది..? అక్కడి పరిస్థితులు ఎటు దారితీయబోతోయనేది చర్చనీయాంశంగా మారింది.
బంగ్లాదేశ్‌లో దాడుల నేపధ్యంలో రెండు దేశాల్లోనూ ఆందోళనలు పెరుగుతున్నాయ్. ఇటీవల, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన గురువులను అరెస్ట్ చేయడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, భారతదేశానికి రాజకీయ శరణార్థిగా వచ్చినప్పటి నుండీ …ఆ దేశంలో భారత వ్యతిరేకత బహిర్గతమయ్యింది. ఆమెను శరణార్థిగా కాకుండా, రాజకీయ శరణార్థిగానే భారత్ ప్రకటించినా బంగ్లాదేశ్ నేతలు మాత్రం..తమ దేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అక్కడ కొన్ని వర్గాలను రెచ్చగొట్టి, భారత్‌కి వ్యతిరేకంగా నిరసనలు చేసేలా తరచూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశ ద్రోహిగా ప్రకటించడం దగ్గర నుండీ ఈ వివాదాలు మరింత తీవ్రం అయ్యాయి.
అయితే బంగ్లాదేశ్‌లో మైనార్టీలే లక్ష్యంగా జరిగిన మారణహోమానికి సూత్రధారి అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తోన్న మహ్మద్ యూనసేనని… ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు. తన తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్‌ను హతమార్చినట్టే తనని, తన సహోదరిని కూడా అంతమొందించేందుకు కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను ఆగస్టులో బంగ్లాదేశ్‌ను వీడాల్సి వచ్చిందన్నారు.
బంగ్లాదేశ్ విజయ్ దివ్‌సను పురస్కరించుకుని న్యూయార్క్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించారు షేక్ హసీనా . దేశాన్ని వీడిన తర్వాత తొలిసారిగా ఆమె చేసిన ఈ ప్రసంగంలో మహ్మద్ యూన్సపై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం …తమ దేశంలో మైనారిటీల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అయినప్పటికీ, వారిపై దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.