తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. కొత్త విగ్రహాన్ని ఈ నెల డిసెంబర్ 9న ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ 2014లో అధికారంలోకి వచ్చాక.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించింది. చాలా నమూనాలు పరిశీలించిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఉన‍్న విగ్రహానికి ఆమోదం తెలిపారు.
పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంపన్నుల బిడ్డగా తయారు చేయించారంటూ.. నిజమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే తమ హడావుడి నిర్ణయంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయేమోనని వాయిదా వేసింది.
తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు అంటే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియేట్ ఆవరణలో ఏర్పాటు చేయడానికి రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిప్రకారమే ఈనెల 9న ఆవిష్కరించడానికి నూతన విగ్రహాన్ని సచివాలయానికి తీసుకువచ్చారు. కాకపోతే విగ్రహం బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో కొత్తగా ఏర్పటు చేస్తున్న తెలంగాణ తల్లి ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
అయితే తాజాగా కొన్ని ఫోటోలు తెలంగాణ తల్లి విగ్రహం ఇలాగే ఉంటుందంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డను గుర్తుచేసేలా తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు.దీనికి అనుగుణంగానే విగ్రహాన్ని తయారు చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న విగ్రహానికి, ఈ విగ్రహాన్ని పోలుస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో..తెలంగాణ సామాన్య మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి ఆకట్టుకుంటోంది. బంగారు రంగు అంచుతో ఉన‍్న ఆకుపచ్చ చీరలో మట్టి గాజులతో, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిండుదనం తీసుకొచ్చేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఎడమ చేతిలో వరి కంకి, మొక‍్కజొన్న కంకి, సజ్జ కంకి ఉండేలా తయారు చేశారు. పోరాట స్ఫూర్తిని తెలుపుతున్న పిడికిళ్లతో తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఉంది.