తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, నర్సింగ్ కాలేజీ శంకుస్థాపనలో పాల్గొన్న సీఎం రేవంత్, తన ప్రసంగంలో నేరుగా కేసీఆర్ పాలనను టార్గెట్ చేశారు. నల్గొండ ప్రజల వృద్ధికి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కీలకమని, అయితే కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి వల్ల జిల్లా అభివృద్ధి నెమ్మదించిందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పదేళ్ల పాలన వల్లే అధిక నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్‌ఆర్ ప్రారంభించారని, కానీ కేసీఆర్ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల లక్ష ఎకరాల సాగు భూమికి నీరు అందలేదని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నల్గొండ ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని, ఉద్యమానికి సంబంధించిన స్మృతులు నల్గొండ పేరు వినగానే గుర్తుకువస్తాయని అన్నారు.
“తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. కానీ బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ తరహా అభివృద్ధి చూపగలవా?” అంటూ రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్‌పై సెటైరిక్ వ్యాఖ్యలు చేస్తూ, “గెలిస్తే ఉప్పొంగడం, ఓడితే ఫామ్‌హౌస్‌కే పరిమితం అవ్వడం కేసీఆర్ పద్ధతి” అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి, కేసీఆర్‌తో నేరుగా సమావేశమయ్యే అవకాశం రాలేదని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌ను ఎదుర్కోవాలని రేవంత్ ఆశిస్తున్నారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్, ఇప్పుడు ఆయనను సలహాలు, సూచనలు అందించేందుకు సభలోకి రావాలని కోరుతున్నారు.
అయితే కేసీఆర్ సభకు హాజరవ్వడం లేదా ఫామ్‌హౌస్‌కే పరిమితం అవ్వడం అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీఆర్‌ఎస్ వర్గాలు కూడా ఈ విషయంలో సందిగ్ధంలోనే ఉన్నాయి. సభకు హాజరవ్వడం ద్వారా అవమానాలకు గురయ్యే అవకాశం ఉందని గులాబీ బాస్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
సమావేశాలు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, రేవంత్ రెడ్డి వ్యూహం, కేసీఆర్ ప్రతిస్పందన ఏం ఉంటాయో అనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.