రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి : సీఎం కేసీఆర్

CM KCR Instructed Officials to Take up Special Covid Vaccination Drive to Vaccinate 3 Lakh People Daily, Coronavirus India Latest Update Live, Coronavirus news live updates, Countering COVID-19, COVID-19, KCR Instructed Officials to Take up Special Covid Vaccination Drive, Mango News, Special drive to vaccinate 3 lakh/day, Telangana CM K Chandrasekhar Rao, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Vaccination, Telangana govt to take up spl drive to vaccinate 3 lakh people, Telangana to vaccinate 3 lakh People

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రగతి భవన్ లో వైద్య ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభమైనందున, విద్యాసంస్థల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదని వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరోనా ఎక్కువయ్యే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు సమావేశంలో వివరించారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాలు పైబడిన అర్హులు 2 కోట్ల 80 లక్షల మంది ఉండగా, ఇప్పటికే 1 కోటి 42 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్, 53 లక్షల మందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, మరో 1 కోటి 38 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉందని సమీక్షలో వైద్యశాఖ అధికారులు సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరియు ఇతర ప్రజా ప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని, ఎంపీఓలు, ఎంపీడీఓలు, డీఎల్పీఓలు, డీపీఓలు, జెడ్పీ సీఈఓలు మరియు ఇతర సిబ్బంది వీటిని సమన్వయం చేసి, వైద్య సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందించి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో గ్రామాల్లో లాక్ డౌన్లు పెట్టుకోవడంతోపాటు కరోనా పేషంట్ల కోసం స్కూళ్లలో ఐసొలేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి సర్పంచులు ప్రజలకు అండగా నిలిచారని సీఎం అభినందించారు. అలాగే, ఇప్పుడు చేపట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి కలెక్టర్లు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సీఎం సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. వ్యాక్సినేషన్ సిబ్బందికి భోజన వసతి సహా ఇతర సౌకర్యాలు కల్పించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూళ్లు, కాలేజీలు, రైతు వేదికలు తదితర ప్రభుత్వ/ప్రైవేటు భవనాలను ఉపయోగించుకోవాలని, అవసరమైన చోట్ల టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలని సీఎం కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో లక్షణాలు ఉండి, వెంటనే అప్రమత్తమైన వారు త్వరగా కోలుకున్నారని, నిర్లక్ష్యం చేసిన వారు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయని సీఎం పేర్కొంటూ ఇకపై కూడా ఏమాత్రం స్వల్ప లక్షణాలున్నా సమీపంలోని పీహెచ్ సీ కేంద్రాల్లో చూపించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మాస్కులు కూడా తప్పనిసరిగా ధరించాలని సీఎం ప్రజలను కోరారు. ఒకవేళ భవిష్యత్ లో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్స్, బెడ్స్ ఏర్పాటు విషయంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇక ముందు వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం: 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిందని, ఇక ముందు వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిమ్స్ దవాఖానా పరిధిలో మరో రెండు టవర్స్ నిర్మించి వైద్య సేవలను విస్తృత పరచాలని సీఎం ఆదేశించారు. శుభ్రత ఇతర సేవల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులు కార్పోరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు.

ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెల్త్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ, డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 1 =