హైదరాబాద్ బిర్యానీ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనితో పాటు ఎన్నో డిష్‌లు నోరూరిస్తాయి. మన వంటకాలను ఓసారి టేస్ట్ చేశారంటే, మళ్లీ మళ్లీ తినకుండా ఉండలేరు అయితే ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే బెస్ట్ వంటకాలు కలిగిన టాప్ 100 దేశాల జాబితాను ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ రిలీజ్ చేసింది. 15 వేలకు పైగా ఫుడ్స్ పై వచ్చిన 4,77,287 వ్యాలిడ్ రేటింగ్స్ ని విశ్లేషించి టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను ప్రిపేర్ చేసింది.
హైదరాబాద్‌కు వచ్చిన సెలబ్రెటీలు సైతం ఇక్కడి బిర్యానీ టేస్ట్ చేయకుండా సిటీని వదిలి వెళ్లలేరు . హైదరాబాద్‌ను సందర్శించడానికి వచ్చిన పొరుగు రాష్ట్రాల వాళ్లు బిర్యానీని తినడాన్ని గొప్పగా చెప్పుకొనే సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి హైదరాబాద్ బిర్యానీ స్థాయి మరింత పెరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్‌కు చేరింది.
టేస్ట్ అట్లాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన వంద అత్యుత్తమ వంటకాల్లో ఈ బిర్యానీకి చోటు లభించింది. హైదరాబాద్ బిర్యానీకి 31వ ర్యాంకు లభించింది. ఇందులో హైదరాబాద్ బిర్యానీకి 4.52 రేటింగ్ లభించింది. మరో మూడు భారతీయ వంటకాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
టేస్ట్ అట్లాస్ బెస్ట్ డిషెస్ కలిగిన సిటీస్ ర్యాంకింగ్స్‌ని కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ నగరాలు ఉత్తమ ర్యాంకులు సాధించాయి. ప్రపంచంలోని మిగతా నగరాలతో పోటీ పడి ముంబై 5వ స్థానాన్ని దక్కించుకుంది. అమృత్‌సర్ నగరానికి 43వ ర్యాంకు రాగా ఢిల్లీ 45వ ర్యాంకులో నిలిచింది. ఇక హైదరాబాద్ 50, కోల్‌కతా 71, చెన్నై 75వ ర్యాంకు సాధించాయి. ఈ ర్యాంకులు భారతీయ వంటకాల ఘనమైన వారసత్వాన్ని తెలియజేస్తున్నాయి.