మహా కుంభమేళాలో ప్రవేశం దక్కాలంటే పాటించాల్సినవి..

Things To Follow To Gain Entry To The Maha Kumbh Mela

ప్రయాగరాజ్‌లో త్వరలో జరగనున్న మహాకుంభ మేళాలో సనాతనయేతరుల ప్రవేశంపైన కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. తాజాగా దీనిపై నాగ సన్యాసులు కుంభమేళాలో సాధారణ భక్తుల ప్రవేశానికి కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం మహా కుంభ మేళా జాతర సందర్భంగా గంగా నదిలో భక్తులు ఎవరైనా సరే స్నానం ఆచరించాలంటే.. నుదుటిపై తిలకం, మణికట్టుకి పవిత్రమైన దారం తప్పనిసరిగా ఉండాలి.

దీంతో ప్రయాగ్‌రాజ్ లోని మహా కుంభమేళా మళ్లీ వార్తల్లో నిలిచింది. కొత్త సంవత్సరంలో జరగనున్న మహా కుంభమేళాలో సనాతనయేతరుల ప్రవేశాన్ని అఖారా పరిషత్ నిషేధించిన తరువాత తాజాగా.. ఇప్పుడు నాగ సన్యాసులు కూడా కొత్త మార్గదర్శకాలను వెల్లడించారు. తాము వెల్లడించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహా కుంభమేళాలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా నుదుటిపై తిలకం పెట్టుకుని, మణికట్టుపై పవిత్ర దారం కట్టుకోవడం తప్పనిసరి అని చెప్పారు. సందర్శకుల మహా కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించడానికి ఇది ఆచరించినవారిని మాత్రమే అనుమతిస్తామని నాగ సన్యాసులు స్పష్టం చేశారు.

పవిత్ర హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే ఘటనలు గతంలో జరగడంతో వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు నాగ సన్యాసులు తెలిపారు. మత స్వచ్ఛతను కాపాడటానికి ఈ మార్గదర్శకాలను అమలు చేశామని ..దీన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అలాగే అఖారాస్‌లోని అన్ని ప్రవేశాల వద్ద పోలీసులను మోహరింప జేస్తామని నాగ సన్యాసులు చెప్పారు.పోలీసుల సహకారంతో తాము చేసిన మార్గదర్శకాలను పాటించేలా చూస్తామని .. ఎవరైనా దోషులుగా తేలితే మాత్రం తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే నని వారు తెలిపారు.