అల్లు అర్జున్-పుష్ప 2 ప్రీమియర్ వివాదం: మీడియా వ్యాఖ్యలపై సీపీ క్షమాపణలు..

Allu Arjun Pushpa 2 Premiere Drama CP Apologizes For Media Comments Issues Warning To Bouncers

‘‘నేషనల్ మీడియాను కొనేశారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున 2:49 గంటలకు ఆయన తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. “పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో అల్లు అర్జున్ గురించి వరుస అసహనకరమైన ప్రశ్నలు అడగడం వల్ల, నేను కూల్ కోల్పోయి నేషనల్ మీడియాపై అనవసరమైన వ్యాఖ్యలు చేశాను. ఈ వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత వహిస్తూ, మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. ఇకపై కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను,” అని సీవీ ఆనంద్ ట్వీట్‌లో తెలిపారు.

మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు:
ఆదివారం జరిగిన సమావేశంలో, బౌన్సర్ల తీరుపై సీవీ ఆనంద్ ఘాటుగా స్పందించారు. ‘‘పబ్లిక్‌ను నెట్టడం, తొక్కిసలాటను ప్రోత్సహిస్తే తాటతీస్తాం. బౌన్సర్లు ఏం చేసినా, సెలబ్రిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది,’’ అని హెచ్చరించారు. పోలీసు అధికారులను టచ్ చేయడం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

‘‘పుష్ప 2 ప్రీమియర్ షో కోసం సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ వచ్చినప్పుడు, తొక్కిసలాట జరగుతోందని పోలీసులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఎసీపీ చెప్పిన తరువాత కూడా ఆయన స్పందించలేదు. చివరికి డీసీపీ గట్టిగా చెప్పడంతోనే థియేటర్‌ను విడిచారు,’’ అని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను ఆయన విడుదల చేశారు. ప్రైవేట్ బౌన్సర్లు పోలీసులను నెట్టినట్లు వీడియోల్లో స్పష్టంగా ఉందని అన్నారు. ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు,’’ అని స్పష్టం చేశారు.