సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన టాలీవుడ్‌ను తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఈ విషాదం టాలీవుడ్‌కు పెద్ద దెబ్బగా మారింది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ నిర్మాత మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారు. అమెరికాలో గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా పర్యటిస్తున్న ఆయన, రీసెంట్‌గా హైదరాబాద్‌కు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూసి, అతని తండ్రి భాస్కర్‌ను మానసికంగా ధైర్యం చెప్పారు.
భాస్కర్ కుటుంబానికి అండగా టాలీవుడ్
తండ్రి భాస్కర్‌కు శాశ్వత ఉపాధి కల్పించేందుకు దిల్ రాజు ప్రతిపాదనలు తీసుకువచ్చారు. టాలీవుడ్ మొత్తం బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందని, భాస్కర్‌ను చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చి, అతనికి ఉపాధి కల్పించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. “సినిమా పరిశ్రమ తరపున బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తాను,” అని దిల్ రాజు హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు
దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. “రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిని కలుస్తాము. చిత్ర పరిశ్రమ నుంచి పెద్దలందరితో కలిసి ఈ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని ఆయన తెలిపారు.
ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య వారధిగా దిల్ రాజు
టాలీవుడ్‌కు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు దిల్ రాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. “సినిమా పరిశ్రమను ప్రభుత్వం దూరం పెట్టిందనే వాదన తప్పు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం టాలీవుడ్‌కు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోంది. ఈ బాధ్యత నాపై ఉందని నేను భావిస్తున్నాను,” అని ఆయన తెలిపారు.
అల్లు అర్జున్ కేసు కారణంగా గందరగోళం
సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్‌లో రాజకీయ దుమారానికి దారితీసింది. ముఖ్యంగా, ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై వస్తున్న ఆరోపణలు, టికెట్ రేట్లు పెంపు మరియు బెనిఫిట్ షోల రద్దు నిర్ణయాలు టాలీవుడ్‌కు పెద్ద చిక్కుగా మారాయి. దిల్ రాజు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.