మనిషికి తిండి,నీళ్లు ఎంత అవసరమో నిద్ర అంతకంటే అవసరం. రోజంతా పడిన కష్టాన్ని మన శరీరం తనకు తానే రిపేర్ చేసుకుని మళ్లీ యదార్ధ స్థితికి తీసుకురావడానికి నిద్ర చాలా అవసరం. అయితే మారిన జీవన శైలితో చాలా మందికి కంటి నిద్ర కరువవుతుంది. దీంతో చాలామంది రాత్రిళ్లు నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు.
ముఖ్యంగా ఒత్తిడితో బాధపడేవారికి..నిద్ర పూర్తిగా దూరం అవుతుంది. అందుకే చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ ప్రతి వ్యక్తికి రోజుకు 6 నుంచి 7 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. నిద్రపోవడం ద్వారా శరీరానికి తగినంత విశ్రాంతి లభించి జీవక్రియ సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉంటాడు.
అయితే ఇలాంటి నిద్ర లేమి సమస్యలున్న వారికి చెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ పరిమాణంలో చెర్రీ జ్యూస్‌ను పడుకునే రెండు గంటలకు ముందు తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందట. దీనివల్ల ఆరోగ్యంపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు.
ఎందుకంటే చెర్రీలలో ఉండే మెలటోనిన్ కంటెంట్ కారణంగా.. చెర్రీ జ్యూస్ మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మెలటోనిన్‌ను సాధారణంగా ‘స్లీప్ హార్మోన్’ అని పిలుస్తుంటారని..ఇది మనిషి ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్ర లేవాలో నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.ఇవి చెర్రీలలో పుష్కలంగా ఉంటాయి.
అలాగే చెర్రీ జ్యూస్‌లో ఉండే ట్రిప్టోఫాన్, మెలటోనిన్ సమ్మేళనాలు కూడా నిద్రపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయట. సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడం ద్వారా ఇది శరీర సహజ నిద్ర ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. కాబట్టి పడుకోవడానికి రెండు గంటల ముందు ఈ జ్యూస్ తీసుకుని నిద్రపోతే హాయిగా నిద్ర పడుతుంది.
రాత్రి సమయంలో దీని రెగ్యులర్ వినియోగం కొద్ది రోజుల్లోనే సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది. నిద్రను ప్రోత్సహించేందుకు రోజూ గ్లాసు చెర్రీ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మెలటోనిన్ ఉన్న ఆహారాలను చెర్రీ జ్యూస్‌తో పాటు సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.